జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కలకలం | - | Sakshi
Sakshi News home page

జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కలకలం

Sep 4 2026 1:18 AM | Updated on Sep 4 2026 1:18 AM

చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

(సబ్‌ రిజిస్ట్రార్‌) అరెస్టు, రిమాండ్‌

నిజామాబాద్‌ పోలీసుల రాకతో

వెలుగులోకి..

నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు

– మార్చిలో పాలమూరులో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు

– ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై అధికారుల ఆరా!

మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా స్టాంపుల మరియు రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో చిట్స్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఖుద్సియాబదర్‌ అరెస్టుతో ఒక్కసారిగా జిల్లా కార్యాలయం ఉలిక్కిపడింది. నిజామాబాద్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన గతేడాది ఏప్రిల్‌ 2న మహబూబ్‌నగర్‌ చిట్స్‌ విభాగంలో బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటేషన్‌పై వచ్చిన ఖుద్సియా గతంలో పాలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కూడా విధులు నిర్వహించారు. తాజాగా ఆయనను నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. విషయాన్ని ఇక్కడి అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చిట్‌ఫండ్స్‌ కార్యకలాపాలు ఇతడి సమక్షంలోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఏమైనా అక్రమాలు జరిగాయా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్‌లో అలా..

నిజామాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఖుద్సియాబదర్‌ విధులు నిర్వహించే సమయంలో నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈయన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో గల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెల మధ్య కాలంలో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. నిజామాబాద్‌లో చేసిన విధంగానే పాలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా ఏమైనా అక్రమాలు జరిగాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ మధ్యకాలంలో జరిగిన దస్తావేజులపై విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలు స్తోంది. ఈ అధికారి అరెస్టుతో ఒక్కసారిగా కార్యాలయంలో తనతో కలిసి పని చేసిన ఉద్యోగుల్లో భయం మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

డిప్యూటేషన్లతో అధికారుల ఇష్టారాజ్యం..

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సిన అధికారులు తమకు నచ్చిన కార్యాలయాలకు డిప్యూటేషన్‌పై వెళ్తున్నారు. వారి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా కార్యాలయాలు ఇన్‌ఛార్జ్‌ అధికారులతో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యూటేషన్లపై అధికారులు సరైన నిర్ణయం తీసుకుంటారో.. లేక కాసుల కోసం అలాగే కొనసాగిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement