మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఆగస్టు నెల అంటేనే నిత్యం కురిసే వానలు.. ఉప్పొంగే వాగులు.. అలుగులు పారే చెరువులే కనిపించేవి. కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోగా లోటువర్షపాతం నమోదైంది. ఏటా ఖరీఫ్‌కు ఊపిరి పోసే ఆగస్టు ఈసారి నిరాశనే మిగిల్చింది. జిల్లాలో ఆగస్టులో సాధారణంగా 149.1 మి.మీ., వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 106.8 మి.మీ., మాత్రమే కురవడంతో 28.4 శాతం లోటు ఏర్పడింది. 17 మండలాల్లో 13 మండలాలు వర్షలోటు బారిన పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వర్షాభావం ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడింది. ఈ ఖరీఫ్‌లో 4,05,236 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసినా.. ఇప్పటి వరకు 2,93,360 ఎకరాల్లోనే సాగు నమోదైంది. ప్రధానంగా వరి సాగు తీవ్రంగా దెబ్బతింది. 2.40 లక్షల ఎకరాల లక్ష్యానికి కేవలం 1,45,119 ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పత్తి సాగు మాత్రం 88,525 ఎకరాలతో లక్ష్యానికి చేరువైంది.
● జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరిపంట ఎక్కువగా బోర్లపైనే ఆధారపడుతోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలకు మించి నీరు అందే పరిస్థితి లేదు. మిగతా విస్తీర్ణమంతా భూగర్భ జలాలపైనే ఆధారపడుతోంది. అయితే వర్షాలు లేక బోర్లలో నీటిమట్టాలు పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టినా రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్ శివారులో సాగునీరు లేక ఎండిన వరి పైరు (ఇన్‌సెట్‌లో) నెర్రెలిచ్చిన వరి పొలం
వరి సాగు విస్తీర్ణం అంచనా
2.40లక్షలు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 28.4 శాతం లోటు వర్షం
మూడు నెలలుగా ఇదే పరిస్థితి.. రైతుల్లో ఆందోళన
13 మండలాల్లో ప్రభావం.. ఐదు ప్రాంతాల్లో 50 శాతానికిపైగానే
వాతావరణ సూచనలతో సెప్టెంబరుపైనా సన్నగిల్లుతున్న ఆశలు
అడుగంటిన బోర్లు.. నెర్రెలు బారుతున్న వరి పొలాలు
సాగైన విస్తీర్ణం
1,45,119


