మహబూబ్‌నగర్ క్రైం: మహిళలు, బాలికలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట సమగ్ర సేవలు అందించడమే భరోసా కేంద్రం ప్రధాన ఉద్దేశం అని ఎస్పీ జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని భరోసా సెంటర్‌లో బుధవారం భరోసా కేంద్రం– ఒకేచోట అన్ని సేవలు అనే పోస్టర్ ఆవిష్కరించి.. మాట్లాడారు. జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా భరోసా కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. బాధితులకు తక్షణ రక్షణ కల్పించడంతోపాటు వారి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని అవసరమైన సహాయం అందించడం జరుగుతుందన్నారు. భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్, పోలీస్, వైద్య, న్యాయ సహాయం, పునరావాసం, విద్య, ఉపాధి వంటి సేవలు అందుతాయన్నారు. ప్రధానంగా బాధిత మహిళలకు మానసిక ధైర్యం కల్పించి, వారు తిరిగి సాధారణ జీవితం కొనసాగించేలా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు, బాలికలు, విద్యార్థినులు వేధింపులు, హింస, లైంగికదాడి లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణ, డీసీఆర్‌బీ సీఐ నర్సింహులు, భరోసా ఎస్‌ఐ అరుణ తదితరులు పాల్గొన్నారు.


