● భూ భారతి దరఖాస్తులను వెంటనేపరిష్కరించాలి : కలెక్టర్ ఖుష్బూగుప్తా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రెవెన్యూ కార్యక్రమాలను తహసీల్దార్లు సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ.. తమ పరిధిలోని ప్రతి అంశంపై తాజా గణాంకాలు, వాస్తవాలతో పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భూ భారతి, సాదాబైనామా, రీసర్వే, నక్షా సర్వే, మీసేవ, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు, 22ఏ భూములు తదితర అంశాలపై సమీక్షించారు. రెవెన్యూ సేవలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ముఖ్యంగా భూ భారతి పోర్టల్‌లో 60 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ ఫైళ్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ.. కోర్టు కేసుల నివేదికలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతి మండలంలో అనవసర పెండెన్సీ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల రీ సర్వే వేగవంతం చేసి, సరిహద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల డిమార్కేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. 22ఏ కింద ఉన్న భూముల విషయంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను స్పష్టంగా గుర్తించి, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనకు కృషి
జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన ప్రతి కేసును సీరియస్‌గా తీసుకోవాలని.. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


