కలవని చేతులతో..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీని వాస్‌రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సీఎం మద్దూరు పర్యటనపై ఆసక్తి
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్‌ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రఓవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


