కోస్గి రూరల్: గుండుమాల్ మోడల్ స్కూల్‌లో బోరు మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యార్థిని విద్యుదాఘాతానికి గురైన ఘటనపై తహసీల్దార్ భాస్కరస్వామి ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టినట్లు డిప్యూటీ తహసీల్దార్ జ్యోత్స్న తెలిపారు. మోడల్ స్కూల్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అంకిత విద్యుదాఘాతానికి గురి కావడంతో కుడి చేయికి తీవ్ర గాయం అయిందన్నారు. ఆ సమయంలో సమయంలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ప్రిన్సిపాల్, సిబ్బందిని వేర్వేరుగా విచారించామని, మోటార్ స్టార్టర్ పనితీరును పరిశీలించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీకాంత్, వెంకట్రామలు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ తదితరులు ఉన్నారు.


