జడ్చర్ల: ప్రేమించిన యువతి ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్తుండడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. జడ్చర్ల పరిధిలోని నెక్కొండలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్ (18) అదే గ్రామంలో ఉంటున్న తన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పై చదువుల కోసం సదరు యువతిని ఆమె తల్లిదండ్రులు మరో ప్రాంతానికి పంపించారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు మంగళవారం యువతికి వీడియో కాల్ చేసి తాను ఒంటరిగా ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతడు గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి వస్పుల అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
చేపల వేటకు వెళ్లి
వ్యక్తి మృతి
జడ్చర్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల పరిధిలో చోటు చేసుకుంది. బా ధితు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇంద్రనగర్‌కు చెందిన పంబాల రమేష్ (42) సోమవారం జడ్చర్ల సమీపంలోని కన్నరెడ్డి బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా బుధవారం ఇంద్రనగర్ సమీపంలోని బావిలో ఆయన మృతదేహం నీటిపై తేలడంతో గమ నించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడని, మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
చెంచుగూడెంలో
గిరిజన యువకుడి హత్య
కొల్లాపూర్ రూరల్: మండలంలోని లచ్చనాయక్‌తండా పంచాయతీ పరిధిలోని చెంచుగూడెంలో మంగళవారం రాత్రి తిరుగుడు సన్నయ్య (40) హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు వివరాలు.. తిరుగుడు సన్నయ్య తన పెద్దన్న భార్య సాలమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుమారుడు తిరుగుడు ఎల్లయ్య రాత్రి 10 గంటలకు సన్నయ్య ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో ఎల్లయ్య కర్రెతో సన్నయ్య తలపై కొట్టగా.. తీవ్ర గాయమైంది. బుధవారం ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా అప్పటికే సన్నయ్య మృతి చెందాడు. అనుమానంతో ఎల్లయ్యను గ్రామస్తులు ప్రశ్నించడంతో తానే కొట్టినట్లు నేరం అంగీకరించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి తమ్ముడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఎల్లయ్యపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బండారు ఆనంద్ తెలిపారు.
11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 123.558 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి శ్రీశైలానికి వదులుతున్నామని తెలిపారు.


