● బైక్, బస్సు ఢీ: యువకుడి దుర్మరణం
● వివాహమైన రెండు నెలలకే ఘటన
● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రాజాపూర్(బాలానగర్): విధులకు ఆలస్యమైందనో.. సమయానికి విధులకు హాజరు కావాలనో.. అతివేగంగా బైక్‌పై వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు దుర్మరనం చెందాడు. వివాహమైన రెండునెలలకే అతని ఆయుష్సు మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అనంతవాయువులో కలిసిపోయింది. వివరాలిలా.. బాలానగర్ మండలం వీరన్నపల్లికి చెందిన అరవింద్(25) బాలానగర్ మండలంలో మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం వీరన్నపల్లి నుంచి 1:45నిమిషాలకు బయలుదేరి బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద మధ్యాహ్నం 2గంటలకు విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇంటినుంచి బైక్‌పై బయలుదేరిన 20నిమిషాల్లోనే ఉడిత్యాల శివారులో షాద్‌నగర్ నుంచి నవాపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి రెండునెలల క్రితం నవాపేట మండలం ధరిపల్లికి చెందిన యువతితో వివాహమైందని గ్రామస్తులు తెలిపారు.
ప్రాణాలు కాపాడని హెల్మెట్
బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధనలున్నా.. విధులకు వెళ్తూ.. విధిగా తలకు హెల్మెట్ ధరించినా.. అరవింద్ ప్రాణాలను కాపాడ లేకపోయింది. తండ్రి లేకపోయినా ఉమ్మడి కుటుంబంగా అన్నదమ్ములు కలిసి మెలిసి ఉన్న కుటుంబంలో ఇలా తన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మృతిచెందాడన్న వార్త విన్న అన్న రాఘవేందర్, తల్లి, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలిసిన బాలానగర్ ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి ప్రాథమిక విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


