మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని శ్రీసరస్వతీ శిశు మందిరంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ (క్రీడాపోటీలు) మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ క్రీడాపోటీల్లో ఆయా శిశుమందిరా ల నుంచి దాదాపు 1600కిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో పోటీలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, యోగాసన, వాలీబాల్, అథ్లెటిక్స్ అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ క్రీడాపోటీలకు హాజరుకావడం అభినందనీయమని అన్నారు. తన కుటుంబంలో కూడా అన్న సరస్వతి శిశుమందిరంలో చదువుకున్నారని, ఆ సంస్థలో నేర్పించే విలువలు, క్రమశిక్షణను తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సరస్వతి విద్యాపీఠంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరిమిత వేతనాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎంతో నిబద్దతతో పనిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మా ల మమత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దక్షిణమద్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరావు, దేవేంద్రరాజు, అశోక్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, రాంరెడ్డి, గంగాధర్ యాదవ్ పాల్గొన్నారు.


