● ఒకరిని వాహనంతో ఢీకొట్టి..
మరొకరిని కత్తితో గొంతుకోసి..
● వేర్వేరు హత్య కేసులను ఛేదించిన
నాగర్‌కర్నూల్ పోలీసులు
కందనూలు: ఆస్తిపై ఆశ.. డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికాగా.. పోలీసులు రెండు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఒక ఘటనలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను బొలేరో వాహనంతో ఢీకొట్టి హత్య చేయగా.. మరో ఘటనలో తోడికోడలికి చెందిన భూమి, బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసిన మహిళ ప థకం ప్రకారం ఆమెను హత్య చేసింది. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను నాగర్‌కర్నూల్ డీఎస్పీ బర్రి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిందని..
తాడూరుకి చెందిన వెనుపోతుల భీమయ్య బొలేరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వివిధ పనుల కోసం కూలీలను వాహనంలో తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ(40) 15 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా 19ఏళ్ల కుమారుడితో కలిసి గ్రామంలోనే ఉంటుంది. సందర్భానుసారంగా వ్యవసాయ పనుల నిమిత్తం కూలీ పనికోసం భీమయ్య దగ్గరకు వస్తూ ఉండేది. ఆ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. బంగారమ్మ తన అవసరాల నిమిత్తం అర ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని భీమయ్యకు ఇచ్చింది. అంతేకాకుండా తన బంగారు ఆభరణాలను కుదవపెట్టి బ్యాంకులో తీసుకున్న డబ్బును కూడా అతడికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే భీమయ్య కొంతకాలంగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నెల 15న బంగారమ్మ ఫోన్ చేసి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా కోరింది. దీంతో ఆమెను తాడూరులోని వ్యవసాయ పొలం వద్దకు రావాలని భీమయ్య చెప్పాడు. అక్కడికి చేరుకున్న అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భీమయ్య బొలేరోతో బంగారమ్మను ఢీకొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బంగారమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు తాడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిని గుర్తించి భీమయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భూమి.. నగలపై కన్నేసి..
బిజినేపల్లి మండలం ఇప్పలతండా పంచాయతీలోని బొర్సుగడ్డతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె భర్త జంపాలియా మూడేళ్ల క్రితం మృతిచెందాడు. చిట్టెమ్మకు నలుగురు తోడికోడళ్లు ఉండగా.. తన పొలాన్ని వారికి కౌలుకిచ్చింది. వారిలో పెద్ద యారాలు కేతావత్ హీరమ్మకు చిట్టెమ్మ భూమి, బంగారు, వెండి ఆభరణాలపై ఆశ ఏర్పడింది. చిట్టెమ్మను హత్య చేసేందుకు ముందుగానే పథకం రచించింది. ఈ నెల 15న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి సారాను తీసుకుని అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి సారా తాగగా.. చిట్టెమ్మ మత్తులో పడిపోయింది. ఇదే అదనుగా భావించిన హీరమ్మ కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేసింది. అనంతరం చిట్టెమ్మ కాళ్లకున్న వెండి కడియాలు, ఇతర ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి అన్న కొడుకు ముడావత్ వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు హీరమ్మపై అనుమానం ఉందని వినోద్ పోలీసులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో హీరమ్మ తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, తాడూరు ఎస్‌ఐ రాములు, బిజినేపల్లి ఎస్‌ఐ షంషోద్దీన్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.


