● ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావద్దని
ఏబీవీపీ ఆందోళన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దే ప్రత్యేక విద్యావ్యవస్థ అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నవీన్, మణిశంకర్, నరేష్, కార్తీక్, రఘు, చరణ్, భరత్, అనిల్ పాల్గొన్నారు.


