● బీఆర్‌ఆర్ కళాశాలతో
వారసత్వ శాఖ ఎంఓయూ
● విద్యార్థులకు చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలపై అవగాహన
జడ్చర్ల టౌన్: ప్రాచీన కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్య త అని ప్రభుత్వ వారసత్వ శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్‌రావు అన్నారు. మంగళవారం జడ్చర్లలోని డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో వారసత్వ శాఖ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు వారసత్వ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంతోపాటు పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంఓయూ చేసుకున్నట్లు అర్జున్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా వారసత్వ ప్రదేశాల సందర్శనలు, ఫీల్డ్ స్టడీస్, పరిశోధనలు, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య, చరిత్ర శాఖ అధ్యాపకులు డా.రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో వారసత్వ పరిరక్షణపై బాధ్యత పెంపొందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించేందుకు విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం వారసత్వ శాఖ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లునాయక్, ఓఎస్‌డీ రాజులు తదితరులు పాల్గొన్నారు.


