● టీ తాగేందుకు వచ్చి
పుస్తెల తాడు అపహరణ
● మోటార్ బైక్‌పై దొంగల పరారీ
జడ్చర్ల: పట్టణంలో టీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉదయకళ టీకొట్టు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు యమహా ఆర్ 15 బైక్‌పై టీకొట్టు వద్దకు వచ్చారు. ఒక యువకుడు బైక్‌పైనే ఉండగా.. మరో యువకుడు టీ కొట్టు దగ్గరకు వెళ్లి సిగరెట్ తీసుకున్నాడు. టీ కావాలంటూ అడుగగా సదరు మహిళ టీ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీ ధర ఎంత అని అడిగాడు. టీ ధర రూ.10 అనగానే అమ్మో అంతనా అంటూ మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును తెంపుకొని బైక్‌పై కొత్త బస్టాండ్ వైపు పారిపోయారు. వెంటనే మహిళ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పుస్తెలతాడు 3 తులాలు ఉంటుందని బాధిత మహిళ వాపోయింది. విషయం తెలుకున్న ఎస్‌ఐ ఖాదర్ ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల్లో వారు పారిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి.
విచ్చలవిడిగా పోకిరీలు
అయితే కొన్ని నెలలుగా జడ్చర్ల పట్టణంలో పోకిరీలు మోటార్ బైక్‌లపై స్టంట్లు చేస్తూ.. సైలెన్సర్ల మోత మోగిస్తున్నారు. బాంబులు పేలుతున్న శబ్దాలను చేస్తూ రోడ్లపై దూసుకుపోతున్నారు.గంజాయి, తదితర మద్యం మత్తులో పెట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా టీ కొట్లు వీరికి అడ్డాలుగా మారాయి.టీ షాప్‌ల్లో సిగరెట్ల చాటున గంజాయి తాగి రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ మచ్చుకై నా కానరావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.


