మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వచ్చే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ గెలుపుతోనే సంస్థ మనుగడ ఉంటుందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మహబూబ్‌నగర్ రీజియన్‌లోని పది డిపోల గ్యారేజీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజీ కార్మికుల డిజిగ్నేషన్లను పెంచడానికి కృషి చేస్తామన్నారు. మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సమస్యల పరిష్కారంలో గణనీయమైన మార్పులు తెస్తామన్నారు. శ్రామిక్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని కేటగిరీల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, చట్టవిరుద్ధ డ్యూటీలపై, అనవసరంగా అధికారులు వేధింపులకు గురిచేసినా ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సంస్థకు సుమారు రూ.లక్ష కోట్ల విలువజేసే ఆస్తులున్నాయని, అన్యాక్రాంతమైనవి అమ్మి రూ.4 వేల కోట్ల అప్పులను తీర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, నాయ కులు నాగయ్య, వహీద్, రాజలింగం, అహ్మద్‌ఖాన్, నిరంజన్, రాజేందర్, గోవింద రావు, నారాయణ, చంద్రయ్య, మధుసూదన్, భానుప్రకాష్‌రెడ్డి, కె.రవీందర్‌రెడ్డి, బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.


