● రోజురోజుకు తెరపైకి వస్తున్న
కొత్త అంశాలు
● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ
● వాస్తవాలు తేలాలంటే
సమగ్ర విచారణే మార్గం
సదరు ఉన్నతాధికారికి సంబంధించిన పలు వ్యవహారాలను ఆ ఎస్‌ఐ పర్యవేక్షించేవారని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో గద్వాల–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరాలపై జరిగిన దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంలోనూ ఇద్దరి పాత్రపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అలాగే నెలవారీ వసూళ్ల వ్యవహారంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించేవారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఎస్‌ఐ గతంలో అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీకి పట్టుబడి.. అనంతరం కొంతకాలం వీఆర్‌లో ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే కీలక పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలున్నాయి. అనంతరం ఓ జిల్లాలో ఏడాది పాటు పనిచేసి, ఆరోపణల నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా అక్కడ రెండు నెలలు పూర్తికాకముందే మరోసారి వనపర్తి జిల్లాకు బదిలీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మహబూబ్‌నగర్ క్రైం/గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్‌ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది.


