● జిల్లాలో మహబూబ్‌నగర్
రూరల్‌లో తొలిసారిగా ప్రారంభం
● 49 బడుల్లో ఇడ్లీ, దోశ, పూరి వడ్డన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు ఉదయా న్నే అల్పాహారం అందించే ‘బడుల్లో టిఫిన్’ కార్యక్రమం జిల్లాలో తొలిసారిగా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో ప్రారంభమైంది. అక్షయపాత్ర ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ట్రయల్ కార్యక్రమంలో మండలంలోని 49 పాఠశాలల్లో విద్యార్థులకు ఇడ్లీ, దోశ, పూరి తదితర అల్పాహారాన్ని అందించారు. మొత్తం 1,650 మంది విద్యార్థులు టిఫిన్ తీసుకున్నారు. మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టిఫిన్ తయారీ, పాఠశాలలకు తరలింపు, విద్యార్థులకు పంపిణీ తదితర అంశాలను పరిశీలించేందుకు సోమవారం ట్రయల్స్ నిర్వహించారు. అల్పాహారం నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయపాత్ర ద్వారా జిల్లాలోని ఏడు మండలాల్లో మధ్యాహ్న భోజనం అందుతోంది. మిగిలిన మండలాల్లో వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం కొనసాగుతోంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ అందించే లక్ష్యంతో నాలుగు ప్రాంతాల్లో అక్షయపాత్ర కిచెన్ షెడ్ల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేసినట్లు సమాచారం. అవి అందుబాటులోకి వస్తే దశలవారీగా అన్ని మండలాల్లోనూ టిఫిన్ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉంది.


