ఉత్సాహంగా ఖేల్‌కూద్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఖేల్‌కూద్‌ పోటీలు

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

1,650 మందికిపైగా విద్యార్థుల హాజరు

మూడు రోజులపాటు కొనసాగనున్న క్రీడలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నగరంలోని బండమీదిపల్లి శివారు శ్రీసరస్వతీ శిశుమందిరంలో మూడు రోజులపాటు శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్‌ (క్రీడాపోటీలు) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్‌, మేయర్‌ మమత, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌, విద్యాపీఠం ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతికుమార్‌ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు విద్యార్థుల సమగ్ర వికాసంలో అత్యంత కీలకమైనవి అన్నారు. క్రీడలు శారీరక ధృడత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమష్టిభావన, నాయకత్వ లక్షణాలు పెంపొదిస్తాయన్నారు. గెలుపు ఒక్కటే క్రీడల లక్ష్యం కాదని, ఓటమిని స్వీకరించి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించే సంకల్పాన్ని క్రీడలు నేర్పుతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌, ఓబుగారి శ్రీనివాసయ్య, ఎల్లప్ప, మద్ది అనంతరెడ్డి, పాలుట్ల యాదయ్యగుప్తా, గంగాధర్‌ పాల్గొన్నారు.

పలు క్రీడాంశాల్లో పోటీలు

తెలంగాణ ప్రాంత రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్‌ క్రీడా పోటీల్లో ఆయా శిశు మందిరాల నుంచి దాదాపు 1650 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, చెస్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలు మంగళవారం వరకు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement