మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఆదివారం మహబూబ్‌నగర్ ఫస్ట్, జిల్లా సాంస్కృతిక సేన ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 250కిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–9, 12, 16, ఓపెన్ విభాగాల్లో చెస్ పోటీలు జరిగాయి. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ చెస్ పోటీలను పరిశీలించి మాట్లాడారు. యువ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు చెస్ పోటీలు దోహదపడుతాయన్నారు. చెస్ ఆడడం వల్ల మేధోశక్తి, ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయా విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు టోఫీతోపాటు నగదు ప్రోత్సాహకం అందజేశారు. కార్యక్రమంలో చెస్ కోచ్ ఆనంద్‌బాబు, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి నర్సింహులు, యాదగిరి, దాసు, శేఖర్, కేశవులు, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.


