● ఆకట్టుకున్న యువతులసంప్రదాయ నృత్యాలు
● మొలకల బుట్టలతో భారీ ఊరేగింపు
● గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా వేడుకలు
లింగాల: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తీజ్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో తీజ్ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాతీగా వస్తోంది. 9 రోజుల పాటు నిర్వహించిన తీజ్ సంబరాలను మొలకల పండుగతో ముగించారు. బంజారా వాడలోని మేరమ్మ భవాని ఆలయం ఆవరణలో గిరిజన యువతులు నిష్టతతో బుట్టల్లో మొలకలను పెంచారు. చివరి రోజు బంజారా వేషాధారణలతో యువతులు మొలకల బుట్టలను తలపై ఉంచుకొని నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా ఆనందాన్ని పంచుకున్నారు.
కుంటలో నిమజ్జనం
మేరమ్మ ఆలయం ఆవరణలో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన మొలకల బుట్టలను డీజే పాటలకు బంజారా నృత్యాలతో భారీ ఊరేగింపుగా వెళ్లిన బంజారాలు పట్టణ సమీపంలోని రామాలయం ఎ దుట ఉన్న పెద్దకర్ణం కుంటలో నిమజ్జనం చేశారు.


