● 9 శాఖల శకటాల ప్రదర్శన..ఉత్తమ స్టాల్స్‌కు నగదు బహుమతులు
● లబ్ధిదారులకు చెక్కులు.. ప్రతిభావంతులకు సన్మానాలు
పాలమూరు: జిల్లా పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుకు పరేడ్ కమాండర్ కృష్ణయ్య గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మంత్రి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా 1,219 మహిళా సంఘాల సభ్యులకు రూ.143 కోట్ల రుణాల చెక్కులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 559 మందికి రూ.1.11 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 350 మందికి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలు, 25 మంది విద్యార్థులకు సైకిళ్లు, 14 మంది మహిళలకు స్కూటీలు పంపిణీ చేశారు. భారత్‌కు జూనియర్ హ్యాండ్‌బాల్‌లో ప్రాతినిధ్యం వహించిన పొల్కంపల్లి సాయి చరణ్‌రెడ్డిని సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొమ్మిది ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో వ్యవసాయ శాఖకు ప్రథమ, డీఆర్‌డీఏకు ద్వితీయ, గృహనిర్మాణ శాఖకు తృతీయ బహుమతులు లభించాయి. స్టాల్స్‌లో మెప్మాకు రూ.15 వేలు, పోలీస్ శాఖకు రూ.10 వేలు, మత్స్యశాఖకు రూ.8 వేల నగదు బహుమతులను మంత్రి అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, శిక్షణ కలెక్టర్ సాయి శివాని, మేయర్ మమత, ముడా చైర్మన్‌లక్ష్మణ్ యాదవ్, ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ జెండాతో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన


