జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామీణ ప్రజలకు కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇకపై మండల స్థాయిలోనే ప్రజావాణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సోమవారం జిల్లాకేంద్రానికి వెళ్లి సమస్యలు చెప్పుకునే పరిస్థితికి ముగింపు పలికేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్ కార్యాలయాల్లోనే ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దూరభారం, ప్రయాణ ఖర్చులు, పనిదినం నష్టం వంటి ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 16 మండలాలు, 423 గ్రామాల ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ బోనాల పండుగ సెలవు కారణంగా 17వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. భూ వివాదాలు, ధరణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు వంటి సమస్యలపై ప్రజలు వినతులు ఇవ్వవచ్చు.
ప్రజలకు తగ్గనున్న ప్రయాణ భారం
జిల్లాలోని అనేక మండలాలు కలెక్టరేట్‌కు 50–60 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. దీంతో గ్రామీణులు రాకపోకలకు అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ఒక్క సమస్య కోసం పలుమార్లు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మండల కేంద్రాల్లోనే ప్రజావాణి నిర్వహణతో ఈ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.
23 శాఖల సమన్వయంతో పరిష్కార యంత్రాంగం
మండల స్థాయి ప్రజావాణికి సుమారు 23 ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకానున్నారు. తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణ, మిషన్ భగీరథ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. సంబంధిత శాఖల సమక్షంలోనే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
స్పందనపై ఆసక్తి
ఇటీవల రెవెన్యూ డివిజన్‌స్థాయిలోనూ ప్రజావాణి ప్రారంభించినప్పటికీ అక్కడ దరఖాస్తుల సంఖ్య పరిమితంగానే ఉంది. అయితే కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రజావాణికి ప్రతి సోమవారం 120 నుంచి 150 వరకు వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో ప్రారంభమయ్యే ప్రజావాణికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మండల పరిషత్‌లకు నిర్వహణ నిధుల కొరత ఉండటంతో అదనపు నిధుల అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక మండలాల్లోనే సమస్యల పరిష్కారం!
ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు
రేపటినుంచి మండల స్థాయిలో ప్రారంభం


