జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేంద్రం నుంచి అందిన నిధులను నిబంధనల ప్రకారం సక్రమంగా వినియోగించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పాఠశాల అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించి, వచ్చే వారంలోపు పనులను పూర్తిచేయాలని సూచించారు. డ్రెయినేజీ, గేట్లు, తలుపు లు, కిటికీలు, ఫ్యాన్లు, లైట్లు, ర్యాంపులు, బాలికల మరుగుదొడ్లలో అవసరమైన సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. దెబ్బతిన్న వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిధులు ఖర్చు చేసినట్లు చూపించడం కాకుండా వాటి వినియోగంతో పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ప్రతి పనికి సంబంధించిన ఖర్చుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు పనులకు ముందు, తర్వాత ఫొటోలు, తేదీ, జీపీఎస్ వివరాలను భద్రపరచాలని సూచించారు.


