పాలమూరు: జిల్లా పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించనున్న 80వ భారత స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెవెన్యూ, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు మైదానాన్ని సిద్ధం చేశారు. ప్రధాన వేదికను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేడుకలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పరేడ్ కమాండర్‌గా ఆర్‌ఐ కృష్ణయ్య వ్యవహరించనున్నారు. వేడుకలకు వచ్చే ప్రజల కోసం తాగునీటి సదుపాయంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన, స్టాల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం పరేడ్ మైదానంలో పోలీసులు కవాతు సాధన నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, క్లాక్‌టవర్, వన్‌టౌన్ చౌరస్తాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎస్పీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ భవనాలకు కూడా విద్యుత్ దీపాలంకరణ చేశారు.
పరేడ్ మైదానాన్ని సిద్ధం చేసిన అధికారులు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
నగరంలో ప్రధాన కూడళ్లకు విద్యుత్ దీపాల అలంకరణ


