దేశం అన్ని రంగాల్లో బలంగా ఉండాలి. ముఖ్యంగా రక్షణ రంగంలో పటిష్టంగా ఉంటేనే అంతర్జాతీయంగా దేశానికి ప్రత్యేక స్థానం లభిస్తుంది. ప్రస్తుతం మన సైన్యం మరింత శక్తిమంతంగా మారింది. భారత సైనికుడిని చూస్తేనే శత్రుదేశాలు ఆలోచించే స్థాయికి చేరుకున్నాం. గతంలో గన్‌ఫైర్‌కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే సైన్యంలో చేరడం కూడా అంత సులభం కాదు. శారీరక దృఢత్వంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ ఉండాలి. మా ఊరి నుంచి 82 మంది సైన్యంలో పనిచేయడం నాకు ఎంతో గర్వకారణం.
– రవి, మాజీ ఆర్మీ జవాన్, కూచూర్
అందరికీ సమాన విద్య కల్పించాలి
ప్రతి ఒక్కరికీ సమానంగా నాణ్యమైన విద్య అందాలి. ప్రభుత్వాలు విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యకు కనీసం 25 శాతం బడ్జెట్ కేటాయిస్తే కేజీ నుంచి పీజీ వరకు విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మారుతున్నాయి. దీంతో విద్యారంగం ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.
– కిష్టయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు
అసమానతలు లేని సమాజం కావాలి
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా సమాజంలో అసమానతలు పూర్తిగా తగ్గలేదు. కులం ఆధారంగా అవకాశాల్లో వివక్ష కొనసాగితే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుని అవినీతిని అంతమొందించేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా రాజకీయ అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. నాయకులకు 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ విధానం తీసుకొచ్చి.. యువత రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి.
– కార్తీక్, ఎంఎస్‌ఎఫ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


