ఆ ఇద్దరి రూటే సపరేటు! | - | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి రూటే సపరేటు!

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

డిస్ట్రిక్ట్‌ క్లబ్‌లో దావత్‌లు?

దిలీ కోసం వచ్చే సిబ్బంది నుంచి డిస్ట్రిక్ట్‌ క్లబ్‌లో నాటుకోడి పులుసు, ఖరీదైన మద్యం బాటిళ్లతో దావత్‌ ఏర్పాటు చేయించుకునేవారని కొందరు ఆరోపిస్తున్నట్లు సమాచారం. తమకు తగిన ‘మర్యాద’ చేయని వారిపై ఉన్నతాధికారి వద్ద ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురిచేసేవారని సిబ్బంది వాపోతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్‌ క్లబ్‌లో సదరు వ్యక్తి కోసం ప్రత్యేక గది కూడా ఉండేదన్న ప్రచారం పోలీస్‌శాఖలో ఉంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఉన్నతాధికారి పేరు చెప్పి కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా పోలీస్‌ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యవహారాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. డీఐజీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపైనా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి పేరు చెప్పుకుంటూ బదిలీలు, ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. తమ మాట వినని సిబ్బందిపై పెద్ద సార్‌కు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023లో ఐదు జిల్లాలను కలిపి జోగుళాంబ జోన్‌–7 ఏర్పాటు చేయడంతో దాని పర్యవేక్షణకు డీఐజీ స్థాయి అధికారిని నియమించారు. డీఐజీ కార్యాలయంలో విధుల కోసం వివిధ హోదాల్లో సిబ్బందిని అటాచ్‌ చేశారు. వీరిలో ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు గన్‌మెన్స్‌, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులున్నారు. వీరిలో ఇద్దరు సిబ్బంది డీఐజీకి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీఐజీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐల బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సదరు ఇద్దరు సిబ్బంది బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన ఓ సిబ్బంది బదిలీల వ్యవహారాన్ని చక్కబెట్టేవారని పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమను సంప్రదించే సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని.. మాట వినని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయించేలా ఉన్నతాధికారులపై ప్రభావం చూపేవారని కొందరు ఆ రోపిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారు సర్దుబాటు చేసుకుంటే తిరిగి కోరుకున్న ప్రాంతాలకు మార్పులు జరిగేవన్న విమర్శలు ఉన్నాయి.

డీఐజీ కార్యాలయంలో వారు చెప్పిందే వేదం

బదిలీల్లో జోక్యం.. దావత్‌లు, డబ్బుల డిమాండ్‌పై ఆరోపణలు

మాట వినని సిబ్బందిపై పెద్దసార్‌కు చాడీలు

ఉన్నతాధికారి పేరు చెప్పి పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు

హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐల బదిలీలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు.. ఎస్‌ఐల బదిలీలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండ్‌ చేసేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్‌కు అంగీకరించని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేవారని.. ఆ తర్వాత వారు సర్దుబాటు చేసుకుంటే కోరుకున్న స్థానాలకు మార్పులు జరిగేవన్న ఆరోపణలు ఉన్నాయి. గత మూడున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు కలిపి సుమారు 300 మందికి పైగా.. ఎస్‌ఐలు వంద మందికిపైగా బదిలీ అయినట్లు సమాచారం. ఈ బదిలీల్లో సదరు ఇద్దరి పాత్రపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు పోలీసు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహించలేక గతంలో పలువురు పోలీసు సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేసిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అక్కడ పనిచేయడం కంటే ఉద్యోగమే వదిలేస్తామని కొందరు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించిన ఘటనలు పలుమార్లు జరిగాయని తెలుస్తోంది.

సర్దుబాటు చేసుకుంటే.. కోరుకున్న స్థానం ?

విచారణకు డిమాండ్‌

డీఐజీ కార్యాలయంలో పనిచేసిన ఈ ఇద్దరు సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పోలీస్‌ వర్గాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. బదిలీలు, దావత్‌లు, డబ్బుల డిమాండ్‌ వంటి ఆరోపణల్లో వాస్తవమెంత? ఉన్నతాధికారి పేరు చెప్పుకుని వారు వ్యవహరించారా? అనే అంశాలపై విచారణ జరిపితే స్పష్టత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు.. వారిని ఆ స్థానం నుంచి బదిలీ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement