సైబర్‌ ఉచ్చులో విద్యార్థులు చొక్కొద్దు | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ ఉచ్చులో విద్యార్థులు చొక్కొద్దు

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: సైబర్‌ మోసాలపై అప్రమత్తతే ఆయుధంగా ఉపయోగపడుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని సైబర్‌ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని స్వామి వివేకనందా డిగ్రీ కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ బ్యాకింగ్‌, సోషల్‌ మీడియా, డిజిటల్‌ చెల్లింపులు వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇదే సమయంలో సైబర్‌ నేరాలు సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. కొత్త రకం పద్ధతులు ఎంపిక చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వీటి పట్ల పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పెట్టుబడి పథకాలను నమ్మి పెట్టుబడులు పెట్టరాదని, ఇలాంటి పద్ధతిలోనే అధికంగా నేరాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మి డబ్బులు ఇవ్వరాదన్నారు. సైబర్‌ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కి సమాచారం ఇవ్వడం, నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అనంతరం సైబర్‌ భద్రతపై విద్యార్థులకు అవగాహన కోసం వీడియోలను ప్రదర్శించారు. అదేవిధంగా పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌, సైబర్‌ క్రైం ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement