నిరీక్షణకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు మోక్షం

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): అర్హులైన నిరుపేదలకు చేయూత అందించే పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పింఛన్ల ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ లాగిన్‌ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 15లోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి.. సెప్టెంబర్‌ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు.

పాత దరఖాస్తులు పక్కనపెట్టి..

గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాలు, తెల్లకాగితాలపై పింఛన్ల కోసం దరఖాస్తు చేసినవారు కూడా తాజా ఫార్మాట్‌లో మరోసారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సమర్పించిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలను కొత్త దరఖాస్తుకు జత చేయాలి. బ్యాంకు ఖాతా నంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో పాటు వ్యక్తిగత వివరాలను ఫారంలో పొందుపరిచారు. ఇవి ఆన్‌లైన్‌ నమోదుకు వినియోగించనున్నారు.

దరఖాస్తులు ఎక్కడంటే..

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో.. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం డీఆర్డీఓ ద్వారా కలెక్టర్‌ పరిశీలనకు పంపి.. తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు.

వృద్ధాప్య పింఛన్లపై సందిగ్ధత

కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ చేసినా.. వృద్ధాప్య పింఛన్ల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. కొత్తగా అర్హత పొందే వృద్ధులకు వర్తించే వయో పరిమితిపై మార్గదర్శకాల్లో స్పష్టమైన వివరాలు లేకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

జిల్లాలో 96,283 మంది

లబ్ధిదారులు

జిల్లాలో ప్రస్తుతం 96,283 మంది ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.23.92 కోట్లకుపైగా చెల్లిస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 33,251, వితంతువులు 40,829, దివ్యాంగులు 12,565, గీత కార్మికులు 595, చేనేత కార్మికులు 427, బీడీ కార్మికులు 1,690, ఒంటరి మహిళలు 4,161 మంది ఉన్నారు. కొత్త దరఖాస్తుల స్వీకరణతో అర్హత కలిగిన మరింత మంది పింఛన్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

పింఛన్ల మంజూరుకు మార్గదర్శకాలు జారీ

అర్హతలు.. అనర్హతలపై స్పష్టత

రేపు కొత్త లబ్ధిదారుల ఎంపిక

వచ్చే నెల నుంచి పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement