మహమ్మదాబాద్: మండల కేంద్రంలోని సీపీఎస్ నంబర్–2 పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, భోజన సౌకర్యాలు, అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. దివ్యాంగుల కోసం నిర్మిస్తున్న భవనం అసంపూర్తిగా ఉండటంపై కాంట్రాక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిల్లులు రాక నిర్మాణం నిలిచిపోయిందని కాంట్రాక్టర్ తెలపగా, రికార్డులు పరిశీలించి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వర్షం కురిసినప్పుడు పాఠశాల ఆవరణలో నీరు నిలుస్తోందని సిబ్బంది తెలపగా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
85.590 ఎంయూ
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగువ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ విద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 40,537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఉద్యమకారులను
ఆదుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ షేక్ ఫారుక్ హుస్సేన్ కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షలు, కుటుంబాలకు పెన్షన్, అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఉద్యమకారులు, వారి కుటుంబాలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను అధికారికంగా సత్కరించాలని కోరారు.


