● క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ
● హన్వాడలో భూమి విస్తీర్ణం, సరిహద్దులపై అధికారులకు దిశానిర్దేశం
హన్వాడ: మండలకేంద్రంలో అధునాతన వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లకు కేటాయించిన స్థలంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహశీల్దార్, సర్వేయర్‌తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి భూమి విస్తీర్ణం, సరిహద్దులు, విద్యార్థుల రాకపోకలకు రవాణా సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల భవన నిర్మాణానికి స్థలాన్ని అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన రెవెన్యూ, సాంకేతిక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి భూమి నివేదిక సిద్ధం చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని తహశీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీఓ యశోదతో పాటు అధికారులకు సూచించారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


