ముగిసిన రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సు సోమవారం ఘనంగా ముగిసింది. మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, ప్రధాన కార్యదర్శి జి.శాంతారెడ్డి, భారతి, చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, డాక్టర్‌ ఇడికోజు శ్రీనివాసాచారి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయప్రద ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు రోజుల సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, అచార్యుల, పరిశోధకులు పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం జరిగిన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి, ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ డీన్‌ పులికొండ సుబ్బాచారి, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ మన్నమోని కృష్ణయ్య తదితర సాహితీవేత్తలు పాల్గొని యశోదారెడ్డి సాహిత్య సేవలను స్మరించుకున్నారు. యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలిక భాషా ప్రయోగాలను నింఘటువుగా తీసుకురావాలని కోరారు. పాలమూరు విశ్వవిద్యాలయం యశోదారెడ్డి సాహిత్యాన్ని గురించి ఽఅధ్యయనం చేసేందుకు మరింత కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని, ఆ యూనివర్సిటీ తెలుగు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదిరిగి మహిళలు ఏ విధంగా ఉన్నత శిఖరాలకు చేర వచ్చో యశోదారెడ్డి జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే తెలుస్తుందన్నారు. యశోదారెడ్డి రచించిన ‘కథా చరిత్ర’ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పునఃముద్రించగా సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మిరెడ్డి, మనుమరాలు చైత్రారెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ‘ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం–2026’ను నవల రచయిత పోల్కంపల్లి శాంతాదేవికి ప్రకటించగా ‘ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం–2026’ను డాక్టర్‌ కొండపల్లి నిహారిణికి అందజేశారు. అదే విధంగా సాహితీరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలకు పురస్కారాలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement