ఎక్లాస్‌పూర్‌ కన్నీటిసంద్రం | - | Sakshi
Sakshi News home page

ఎక్లాస్‌పూర్‌ కన్నీటిసంద్రం

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

కన్నవారి కలలు.. కల్లలు

ఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై తమ ముందు నిలుస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి.

చెదిరిన.. చదువుల తల్లి ఆశలు

బాగా చదువుకోవాలి.. డాక్టర్‌ కావాలి..

నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న

ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి.

ఎక్లాస్‌పూర్‌.. కన్నీరుమున్నీరు

మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్‌లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్‌పురం.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగాతిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది.

అయిజ: గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పూర్‌కి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజ మహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. సోమ వారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు.

అయిజలో అంతిమ యాత్ర..

ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

బోరుమన్న ఎక్లాస్‌పూర్‌..

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్‌పూర్‌కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రియాంక తండ్రి వెంకటేష్‌కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అంత్యక్రియలకు తరలివచ్చిన జనం (ఇన్‌సెట్‌లో) మృతదేహం వద్ద రోదిస్తున్న ప్రియాంక తల్లిదండ్రులు

అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు

పాడె మోసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

తరలివచ్చిన బంధుగణం.. పార్టీలు, సంఘాల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement