అధికార్ల దందా | - | Sakshi
Sakshi News home page

అధికార్ల దందా

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

–8లో u

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవ ప్రదమైన హోదా.. రూ. వేలు, లక్షల్లో జీతాలు.. అయినప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతో అద్దె కార్లు నడుపుతూ బిల్లులు కాజేస్తున్నారు. ఫలితంగా కిరాయి కార్లు నడుపుతూ జీవనం సాగించే నిరుద్యో గుల కడుపు కొడుతున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ సొంత కార్లను వాడుతున్న అధికారులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పర్యటించేందు కు గాను ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఒక్కో వాహనానికి ప్రతినెలా రూ.33 వేల అద్దె చెల్లిస్తారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా.. ట్యాక్సీ ప్లేట్‌ వాహనం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బినామీ పేర్లతో సొంత కార్లు, ఓన్‌ పేట్లు (వైట్‌ నంబర్‌) వాహనాలను వాడుతూ అక్రమంగా బిల్లులు దండుకుంటున్నారు.

ప్రైవేట్‌ వాహనదారులకు కొర్రీలు..

సొంత వాహనం లేదా బినామీ పేర్లతో ఏకంగా మహిళా ఉద్యోగి అయితే తమ భర్త పేరుపై వాహనం పెట్టుకోవడం, బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తూ బిల్లులు తీసుకుంటున్నారు. ఇదే అధికారులు మాత్రం నిరుద్యోగుల తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతూ వేధించడమే కాకుండా బిల్లుల చెల్లింపులోనూ ఆలస్యం చేస్తున్నారు. వాహనం అద్దె, పెట్రోల్‌ లేదా డీజిల్‌, డ్రైవర్‌ జీతం మొత్తం కలిపి నెలకు రూ.24 వేలు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.33 వేలకు పెంచారు. ఇదే అవకాశంగా భావించిన ఆయా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వాహనాలను నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు..

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డ్రైవర్‌ కం ఓనర్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా డ్రైవర్లు ఓనర్లుగా మారి ఉపాధి పొందేందుకు వీలుగా సబ్సిడీపై కార్లు అందిస్తుంది. కానీ, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రాన్స్‌ఫోర్ట్‌ వాహనాలకు బదులుగా అధికారులు సొంత వాహనాలు వాడుతుండటంతో ఎంతోమంది డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా.. ఆందోళనలు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని అద్దె వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏయే శాఖల్లో అంటే..

జిల్లాలో చాలామంది అధికారులు సొంత వాహనాలను వాడుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్‌, సివిల్‌ సప్లయ్‌, ఎంపీడీలు, డీఆర్‌డీఓ, మిషన్‌ భగీరథ, సీడీపీఓలు, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు సొంత వాహనాలు వాడుతున్న వారిలో అధికంగా ఉంటున్నారు.

బినామీ పేర్లతో ఓన్‌ప్లేట్‌ వాహనాలు వినియోగం

నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారుల తీరు

అద్దె పేరిట రూ.వేలల్లో ఖజానాకు గండి

ఉపాధి కోల్పోతున్న అద్దె కార్ల యజమానులు

వినతిపత్రాలు ఇచ్చినా.. ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement