ముగిసిన ‘సర్‌’.. భారీగా ఓట్ల కోత! | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘సర్‌’.. భారీగా ఓట్ల కోత!

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

జిల్లాలో లక్షకు పైగా ఓట్లు తగ్గే అవకాశం

డబుల్‌ ఓటర్లలో స్వస్థలాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎట్టకేలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 45 రోజులుగా ఉత్కంఠ రేపిన ఓటర్ల జాబితా సవరణకు తెరపడింది. ‘ఒక్కరికి.. ఒక్క ఓటు’ లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియలో మృతులు, డబుల్‌ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడంతో జిల్లాలో లక్షకు పైగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో ఎంతమేర ఓట్లు తగ్గాయి? ఎవరెవరి పేర్లు తొలగిపోయాయి? అర్హులైన ఓటర్లలో ఎంతమంది పేర్లు గల్లంతయ్యాయి? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

● జూన్‌ 25న బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి ఓటరుకు రెండు ప్రతులుగా ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేసి, వాటిని ఎలా నింపాలో వివరించారు. పూర్తి చేసిన అనంతరం ఒక ప్రతిని బీఎల్‌ఓలు తీసుకుని.. మరో ప్రతిని ఓటరుకు రశీదుగా అందించారు. ప్రారంభంలో ఫారాల నింపడంపై ఓటర్లలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది. ఫారాలు అందించేందుకు బీఎల్‌ఓలు అవసరమైన చోట గరిష్టంగా మూడుసార్లు ఇళ్లను సందర్శించారు. జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సరిపోదని.. ప్రతి ఓటరుకు మ్యాపింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దీంతో చివరి రోజు వరకు బీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది ఓటర్ల వివరాల నమోదు, పరిశీలన, మ్యాపింగ్‌ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

● మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 50,445 ఓట్లు తగ్గినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడంతో అచ్చంపేట నుంచి అలంపూర్‌ వరకు, నారాయణపేట నుంచి షాద్‌నగర్‌ వరకు వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ఓటర్లు మహబూబ్‌నగర్‌లోనూ, తమ స్వస్థలాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. చాలామంది తమ స్వస్థలంలోని ఓటును కొనసాగించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. దీంతో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలో 26,803, దేవరకద్రలో 25,886 ఓట్లు తగ్గినున్నట్లు సమాచారం.

● కాగా..సర్‌ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ముసాయిదా ఓటరు జాబితాపైనే ఉంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు మిగిలారు? ఎంతమంది పేర్లు తొలగిపోయాయి? డబుల్‌ ఓట్ల పేరుతో ఎన్ని ఓట్లు కోతకు గురయ్యాయి? అర్హులైన ఓటర్ల పేర్లు ఏమైనా గల్లంతయ్యాయా? అన్నదానిపై స్పష్టత రానుంది. ఈ నెల 17న ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత రాజకీయ పార్టీ లు, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలతో ఓటర్ల జాబితా మరింత ఆసక్తికరంగా మారనుంది.

పార్టీలకు ప్రతిష్టాత్మకం

సర్‌ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) నియమించాయి. జిల్లాలోని 846 పోలింగ్‌ స్టేషన్లలో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు ప్రక్రియను పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ 274 మంది, బీజేపీ 272 మంది, కాంగ్రెస్‌ 274 మంది బీఎల్‌ఏలను నియమించుకున్నాయి. జడ్చర్లలో బీజేపీ 151, కాంగ్రెస్‌ 278, బీఆర్‌ఎస్‌ 294 మంది, దేవరకద్రలో బీజేపీ 131, కాంగ్రెస్‌ 278, బీఆర్‌ఎస్‌ 294 మంది బీఎల్‌ఏలను నియమించుకున్నాయి. బీఎల్‌ఏలు తమ పరిధిలో పర్యటిస్తూ ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఫారాల భర్తీలో ఓటర్లకు సహకరించడంతో పాటు డబుల్‌ ఓట్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్ల వివరాలపై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement