పాలమూరు: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంపై ఎంపీ డీకే అరుణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శత శాతంతో
మంచి ఫలితాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ‘శతశాతం’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్డి హాస్టల్‌లో విద్యావలంటీర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు పలువురు ముందుకొచ్చి సహకరిస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన వలంటీర్లు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తూ వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, వలంటీర్లు సమన్వయంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి, గుండా మనోహర్, మదన్‌మోహన్, బుచ్చారెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
16 అడుగులకు
చేరిన నీటి మట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు చేరుకుంది. జూరాల వద్ద ఉన్న ఉంద్యాల పంప్‌హౌస్ ఫేజ్–1 నుంచి రెండు పంపులను నడుపుతూ నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తీలేర్ పంప్‌హౌస్ ఫేజ్–2 నుంచి రెండు పంపులను రన్ చేసి కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో ప్రాజెక్టు నీటిమట్టం కేవలం 9 అడుగులు ఉండగా.. ప్రస్తుతం మరో 7 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 16.6 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. నీటి ప్రవాహం కొనసాగితే త్వరలో కోయిల్‌సాగర్ నుంచి ఆయకట్టు కింద పంటలకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది.


