● సీసీబీ నిర్మాణానికి వినియోగిస్తున్న
కరెంట్ కనెక్షన్ కట్
జడ్చర్ల టౌన్: ‘అడ్డంగా వాడేయి అడిగేదెవరు’ అన్న శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఆదివా రం సెలవు రోజు అయినప్పటికీ హైదరాబాద్ డీపీ ఈ హెచ్‌టీ (అధిక ఓల్టేజ్ విద్యుత్ కనెక్షన్లలో జరిగే విద్యుత్ దొంగతనాలు, మీటర్ల ట్యాంపరింగ్‌ను తనిఖీ చేసి పట్టుకునే ప్రత్యేక విభాగం) అధికారులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆ శాఖకు చెందిన ఏడీ జావెద్ అహ్మద్, ఏఈ జంగయ్య ఆస్పత్రికి చేరుకుని మీటరు నుంచి సీసీబీ నిర్మాణం, బోరుమోటారుతో పాటు కార్మికులు ఉండే గదులకు, ఇతరత్రా విద్యుత్ వినియోగం కోసం వేచిన వైర్లను పరిశీలించారు. ముందుగా మీటరు నుంచి ఆ అక్ర మ కనెక్షన్లు పూర్తిగా తొలిగించారు. సీసీబీ నిర్మాణం కోసం ఇకపై ఏరియా ఆస్పత్రి కరెంట్ వినియోగించరాదని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట స్థానిక లైన్ ఇన్‌స్పెక్టర్ ఆగస్టీన్‌రెడ్డి ఉన్నారు. డీపీఈ హెచ్‌టీ అధికారులు ఆస్పత్రిలో తనిఖీ చేసినట్లు స్థానిక డీఈ చంద్రమౌళి సాక్షికి తెలియజేశారు. ఆస్పత్రి మీటరు నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే శాఖపరమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తాము ఆస్పత్రి బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కనెక్షన్ తొలగించటం లేదని స్పష్టం చేశారు. అయితే 18 నెలలుగా వినియోగిస్తున్న విద్యుత్ విషయంలో తప్పనిసరిగా బిల్లు వసూలు చేస్తామని స్పష్టం చేశారు.


