పుష్కలంగా తాగునీరు | - | Sakshi
Sakshi News home page

పుష్కలంగా తాగునీరు

Aug 10 2026 1:10 AM | Updated on Aug 10 2026 1:10 AM

మిషన్‌ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ఇకపై సమస్య ఉండదు..

నీటి అవసరాలు ఇలా..

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి..

మిషన్‌ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు

ఇకపై కేఎల్‌ఐతోపాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్‌

ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్‌

శాశ్వతంగా తీరనున్న తిప్పలు

గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్‌ భగీరథ స్కీంకు నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్‌ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్‌ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు.

– అంజాద్‌ పాషా, డీఈఈ

కొల్లాపూర్‌: మిషన్‌ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్‌ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్‌ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్‌ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది.

84 మండలాలకు సరఫరా..

కేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో మిషన్‌ భగీరథ పంప్‌హౌజ్‌ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్లు, వాటర్‌ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారం దిశగా..

మిషన్‌ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్‌ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు.

తీరిన ఇక్కట్లు..

తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపితే చాలు, మిషన్‌ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి.

మిషన్‌ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్‌ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి.

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్‌ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్‌ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్‌ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్‌ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement