ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు నిరాశపరుస్తున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదైనా విస్తృతంగా ఉపయోగపడే భారీ వర్షాలు లేవు. జూలైలోనూ చిరుజల్లులు, మోస్తరు వానలకే పరిమితమైంది. భూమి పూర్తిగా తడిసేలా, చెరువులు నిండేలా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు సాగుతున్నప్పటికీ భూగర్భ జలాల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై 31 నాటికి బాలానగర్, మహమ్మదాబాద్ మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. గండేడ్, దేవరకద్ర, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే చిన్నచింతకుంట, కోయిలకొండ, హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, మహబూబ్‌నగర్ అర్బన్, కౌకుంట్ల మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.


