ఇసుక మాఫియా బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియా బరితెగింపు

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

వరిమడిని నాశనం చేశారు

ఆరుగాలం కష్టించే రైతులు సాగుచేసుకున్న వరిసాగును సైతం ఇసుకాసురులు పాడుచేస్తున్నారు. వాగులోకి టిప్పర్లు మా పొలం పక్క నుంచే వెళ్తుంటాయి. మా పొలాన్ని పాడు చేయడంతో పాటు నిన్న రాత్రి ఓ టిప్పర్‌ కూరుకుపోవడంతో జేసీబీని తెచ్చి బయటకు లాగారు. దీంతో ఇటీవల వేసిన వరినాటు దెబ్బతింది. ఇసుక వ్యాపారులను నుంచి తమ పొలాలను కాపాడి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాం. సమీప పొలంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకాసు రులపై చర్యలు తీసుకోవాలి.

– దాచని విజయభాస్కర్‌రెడ్డి, మల్లేపల్లి

ఫిర్యాదు చేస్తున్నా..

దుందుభీ వాగులో ఇసుక అసలే లేదు. ఉన్న మట్టిని తవ్వి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేసి, తర్వాత ఇసుకాసురులను వదిలేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారులు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ఇలా కొనసాగితే సాగు సంగతి దేవుడెరుగు తాగడానికి కూడా నీళ్లు కూడ దొరకవు. – రామకృష్ణ, సర్పంచ్‌, రాజాపూర్‌

రాజాపూర్‌: అసలే ఇసుక అక్రమ దందా.. అడ్డొస్తే అంతు చూస్తామని బెదిరింపులు.. చివరికి రైతులు వేసుకున్న పంటలను సైతం ధ్వంసం చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు అన్న చందంగా మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దుందుభీ వాగు ప్రాంతాలైన రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, రాజాపూర్‌, చెన్నవెల్లి, మల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, నందిగామ, తిర్మలాపూర్‌ తదితర గ్రామాల శివారులో ఇసుకాసురులు పగలు, రాత్రి తేడాలేకుండా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీనికి తోడు వాగు సమీపాల్లో ఉన్న పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా సరే ఇటాచీలు, జేసీబీతో వాటిలోని మట్టిని తోడి కృత్రిమంగా ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తూ.. జడ్చర్ల, షాద్‌నగర్‌ తదితర పట్టణాలకు తరలిస్తూ తమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు.

గ్రామాల్లో సైతం పాడవుతోన్న రోడ్లు...

వాగు పరిసరాల్లో సామర్థ్యాన్ని మించి అధిక లోడ్‌తో ఇసుక నింపుకొని ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్తుండడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. గ్రామాలకు ఉన్న బీటీ రోడ్లు సైతం గుంతలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో యువత ఏ పనులు చేసుకోకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లనే లక్ష్యంగా చేసుకొని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా..

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా.. ఇసుక అక్రమ వ్యాపారానికి అలవాటు పడిన వారు అధికారులు వేసిన జరిమానాలు చెల్లిస్తూ మరుసటి రోజే తమ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు.

వరి నాట్లను సైతం ధ్వంసం చేసి ఇసుక అక్రమ తరలింపు

దుందుభీ వాగు పొడవునాఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాలు

అడపాదడప కేసులు నమోదవుతున్నా పట్టింపులేదు

దాడులు చేస్తున్నాం..

ఇసుక అక్రమగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందంటే దాడులు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో రైతులు, ప్రజలు చైతన్యం కావాలి. గ్రామాల పరిధిలో ఎక్కడైనా ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తుంటే సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – రాజశేఖర్‌, ఎస్‌ఐ, రాజాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement