● మహిళా సంఘాల తయారీ
● మార్కెట్‌లో పెరిగిన డిమాండ్
● ఉపాధితో పాటు ఆదాయం..
● ఆదర్శంగా గండేడ్ మిల్లెట్ యూనిట్
యూనిట్‌లో తయారు చేస్తున్న రొట్టెలు చిరుధాన్యాలతో రూపొందుతున్నాయి. జొన్నలతో పాటు ఊదలు, కొర్రలు, అరకలు తదితర చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇంట్లో సాధారణంగా తయారు చేసుకునే రొట్టెలతో పోలిస్తే వీటికి ప్రత్యేకమైన రుచి ఉండటంతో వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇటీవల పెద్ద పెనం, పొయ్యిని కూడా కొనుగోలు చేశారు. గతంలో ఒకేసారి నాలుగు రొట్టెలు తయారు చేయగా.. ప్రస్తుతం ఎనిమిది రొట్టెలను ఒకేసారి తయారు చేస్తున్నారు. పిండిని మిషన్‌లో వేసి రొట్టెలను కట్ చేసి, అనంతరం పెనంపై కాల్చి ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అనంతరం హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
గండేడ్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనకు పదును పెట్టిన మహిళలు.. చిరుధాన్యాలకు పెరుగుతున్న ఆదరణను తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను ఆసరాగా చేసుకుని చిరుధాన్యాలతో రొట్టెలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు గండేడ్ మండలకేంద్రంలోని చిరుధాన్యాల రొట్టెల తయారీ యూనిట్ నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు తయారు చేస్తున్న రొట్టెలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తిని కూడా క్రమంగా పెంచుతున్నారు. రూర్బన్ పథకం కింద నాలుగేళ్ల క్రితం గండేడ్ మండల కేంద్రంలో రూ.24.5 లక్షల వ్యయంతో మిల్లెట్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది రకాల యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఈ యూనిట్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల మహిళలతో మహిళా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని 403 సంఘాల నుంచి ఒక్కో సంఘం రూ.500 చొప్పున మూలధనాన్ని సమీకరించి కేంద్ర ప్రభుత్వ వాటా కోసం వినియోగించారు. సమీకరించిన మూలధనానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.3.5 లక్షలు మంజూరయ్యాయి. మహిళా సమాఖ్య నుంచి కూడా కొంత మొత్తాన్ని సమకూర్చుకుని యూనిట్ నిర్వహణకు వినియోగించారు.


