● శ్రీరామ రైస్‌మిల్లులో అధికారులు, పోలీసుల తనిఖీలు
● 2,880 టన్నుల
ధాన్యం మాయం.. రూ.10.75 కోట్ల బకాయిలు
● యజమానిపై కేసు.. గతంలోనే మిల్లును సీజ్ చేసిన అధికారులు
మహమ్మదాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా భారీగా బకాయిపడిన మిల్లులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాధిర్యాల్ గేటు సమీపంలోని శ్రీరామ రైస్‌మిల్లులో శనివారం అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు ఏమీ లేకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు.
రూ.10.75 కోట్ల బకాయిలు
శ్రీరామ రైస్‌మిల్లుకు ప్రభుత్వం నుంచి సుమారు 2,880 టన్నుల వరిధాన్యం అందినట్లు అధికారులు గుర్తించారు. ఆ ధాన్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీని విలువ సుమారు రూ.10.75 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి బియ్యం అందించకుండా ఇంత భారీ మొత్తంలో బకాయిపడినట్లు గుర్తించడంతో మిల్లర్‌పై చర్యలకు ఉపక్రమించారు.
మిల్లులో ఖాళీ బస్తాలు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆదిత్యగౌడ్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, ఇతర సిబ్బంది మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఒక్క బస్తా బియ్యం గానీ, ధాన్యం గానీ కనిపించకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యం, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం, ఇప్పటికే చెల్లించిన వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు.
గతంలోనే సీజ్.. అయినా..
శ్రీరామ రైస్‌మిల్లుపై అధికారులు గతంలోనే తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో మిల్లును సీజ్ చేసి, ఉన్నతాధికారులైన డీఎస్‌ఓ, డీఎంలకు సమాచారం అందించడంతో పాటు నివేదికలు కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం భారీగా బకాయి ఉన్నట్లు నిర్ధారించారు.


