ఆత్మకూర్/గద్వాల: జూరాల ఎగువ, దిగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టారు. శనివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 38.507 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 29.236 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 67.743 మిలియన్‌యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. మరోవైపు జూరాలకు 1.73 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 21 గేట్లు ఎత్తి దిగువనకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడుకు 547 క్యూసెక్కులు, భీమా–1కు 1,300, భీమా–2కు 872 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 600, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
15 అడుగులకు చేరిన కేఎస్పీ నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శనివారం 15 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ఉంద్యాల–1 పంపుహౌస్ నుంచి రెండు పంపులను రన్ చేసి తీలేర్–2 పంపుహౌస్‌కు, అక్కడి నుంచి ప్రాజెక్టు 630క్యూసెక్కుల నీటిని చేరవేస్తున్నా రు. రెండు వారాల క్రితం ప్రాజెక్టులో కేవలం 9 అడుగులకు నీటి మట్టం ఉండగా ఎత్తిపోతల నీటితో 6 అడుగుల మేర పెరిగింది.


