పాలమూరు: వెయ్యి పడకల సూపర్‌స్పెషాలిటీ టీచింగ్ ఆస్పత్రి ఈ–బ్లాక్ పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే జూన్ చివరి నాటికి నూతన ఆస్పత్రి ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణకు కేంద్ర బిందువుగా పాలమూరు వెయ్యి పడకల ఆస్పత్రిని రెఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు ఉన్న 21 విభాగాలకు అదనంగా మరో 14 విభాగాలు పెంపొందించి మొత్తం 35 రకాల సూపర్‌స్పెషాలిటీ సేవలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయూష్ హోమియోపతి, యునాని వైద్యశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వెయ్యి పడకల టీచింగ్ ఆస్పత్రిలో ప్రొఫెసర్ల నియామకాలు, ఆధునిక పరికరాలు, ఇతర సౌకర్యాలతో పాటు సర్జికల్ విభాగాలు అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. 2016లో ఏర్పాటు మెడికల్ కళాశాలలో 150 సీట్ల నుంచి ఇప్పుడు 200 ఎంబీబీఎస్ సీట్లకు పెంపొందడం గొప్ప విషయం అని, భవిష్యత్‌లో పీజీ సీట్లు మరిన్ని పెంచడానికి కృషి చేస్తామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అతి త్వరలో ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్, అత్యాధునిక మోడరన్ ఆపరేషన్ థియేటర్ల ఎంఓటీలు, రోబోటిక్ ద్వారా సర్జరీలు చేయడానికి కావాల్సిన పరికాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో 95 శాతం చికిత్సలు పాలమూరులో పూర్తి కావాలని ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ తరహాలో పాలమూరులో వైద్యసేవలు బలోపేతం చేసి రాబోయే తరాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతామన్నారు. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో ఆర్గానిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రిట్రీవల్ సెంటర్, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ ఏర్పాటు చేయడాకి కృషి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలలో ఆడిటోరియం, బాలురు, బాలికల ప్రత్యేక హాస్టల్స్ భవనాలు, పీజీలకు ప్రత్యే వసతి గృహాలు, ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్, బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మాణాలు చేపడుతామన్నారు. పాలమూరులో థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్ అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చేపడతామని, ఇప్పటికే 172 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ నరేంద్రకుమార్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ రవీందర్, అదనపు కలెక్టర్ హరిప్రియ, మేయర్ మమత, డిప్యూటీ సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్ సల్మాన్ షరీఫ్ పాల్గొన్నారు.
35 విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు తీసుకొస్తాం
దక్షిణ తెలంగాణలో పాలమూరును రెఫరల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం
ఎంఆర్‌ఐ, పీజీ సీట్ల పెంపు, హాస్టల్స్ భవనాల నిర్మాణాలు త్వరలో పూర్తి
థర్డ్ లెవెల్ ట్రామాకేర్‌తో పాటు ప్రతి 25 కి.మీ.కు డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తాం
ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ


