జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పంట దిగుబడుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌లో టెండర్ల ప్రక్రియకు సంబంధించి అంతరాయం కలగడంతో ధరల నిర్ణయం ఖరారు కాలేదు. ఆన్‌లైన్‌లో వ్యాపారులు టెండర్లు దాఖలు చేసిన తరువాత ధరలను కేటాయించే సమయంలో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా ధరల ప్రకటనలో ఇబ్బందులు కలిగాయని మార్కెట్ యార్డు కార్యాలయం సిబ్బంది తెలిపారు. తరువాత మ్యానువల్‌గా టెండర్లు దాఖలు చేసేందుకు ప్రయత్నించినా వ్యాపారులు సహకరించకపోవడంతో చివరకు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్‌లో పంట ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం యథావిధిగా విక్రయాలు సాగుతాయని సిబ్బంది తెలిపారు.
సృజనాత్మకతతో
ఆలోచించాలి: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్‌లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్‌మెంట్‌లలో చదివిన విద్యార్థులు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్‌లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబులు, కృష్ణయ్య, అర్జున్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొత్త కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కోర్సుల్లో విద్యార్థులు చేరాలని ఎన్టీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్తు ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. కళాశాలకు బీఎస్సీ బ్యాంకింగ్ ఫైన్సాన్స్ సర్వీస్, బీఎస్సీ హెల్త్ కేర్ సైన్సెస్ వంటివి కోర్సులు వచ్చాయన్నాన్నారు. కళాశాలలో మొత్తం 1400 సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇక్కడ చదివే విద్యార్థులకు సివిల్స్ శిక్షణతో పాటు, ఉద్యోగాలు పొందేవిధంగా శిక్షణ ఇస్తామన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్నిరకాల వసతులతోపాటు, పూర్తి భద్రత కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్ తర్వాత ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదివించే విధంగా కృషి చేయాలన్నారు.


