మహబూబ్‌నగర్ క్రైం: ఏఆర్ సిబ్బందికి మొబిలైజేషన్ శిక్షణ అనేది రిఫ్రెషర్ కోర్సు లాంటిందని, సిబ్బంది సైతం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఏఆర్ పోలీస్ సిబ్బందికి పరేడ్ మైదానంలో రెండు వారాల పాటు నిర్వహించే మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. మొదట శిక్షణ విధానాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పోలీస్ విధుల్లో వేగవంతమైన స్పందన అత్యంత కీలకం అని, ఈ తరహా శిక్షణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమయానికి స్పందించే సామర్థ్యం పెరుగుతుందన్నారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం క్రమశిక్షణ లాంటి లక్షణాలు పోలీస్ సిబ్బందికి అత్యవసరం అని తెలిపారు. ఆయుధాల వినియోగం, డ్రిల్, సమూహంగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వంటి అంశాలలో సిబ్బంది నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పోలీస్‌శాఖ ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్‌కుమార్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.


