త్వరలోనే అన్నింటిపై స్పష్టత
‘సీటీ 2.0’ ద్వారా రూ.10కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు బ్యాంకు రుణ ఆధారితంగా..
● నల్లచెరువు, మురుగునీటి శుద్ధిప్లాంట్, ఫ్‌లైఓవర్ వద్ద దుకాణాల నిర్మాణం
●
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీలో 44వ నెంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన కావేరమ్మపేట సబ్‌స్టేషన్‌కు ఆనుకుని ఉన్న నల్లచెరువుకు మహర్దశ పట్టనుంది. సీఐటీఐఐఎస్ (సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్) 2.0 పథకం కింద రూ.10–20కోట్లతో నల్లచెరువు అభివృద్ధికి నోచుకోనుంది. నల్లచెరువుతోపాటు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పెద్ద మురుగుకాల్వపై మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంట్, జడ్చర్ల క్రాస్‌రోడ్డు ఫ్‌లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం దుకాణా సముదాయం నిర్మాణం ప్రతిపాదలనున్నాయి. మున్సిపాలిటీల్లో పర్యాటకరంగ అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ హితమైన వసతుల కల్పన, నగరాల ఆధునీకరణ వంటివి సీఐటీఐఐఎస్ 2.0 లక్ష్యంగా ఉంది. భారత ప్రభుత్వ గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, యూరోపియన్ యూనియన్ సహకారంతో పథకం అమలవుతుంది. పథకంలో చేయాల్సిన అభివృద్ధి పనుల గూర్చి పైఏజెన్సీ ప్రతినిధి సునీల్ వారం క్రితం మున్సిపాలిటీలో పర్యటించారు. రెండురోజుల క్రితం(బుధవారం) హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఎన్‌ఐయూఎంలో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో మున్సిపల్ కమిషనర్, టీపీఓ, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు.
సీఐటీఐఐఎస్ 2.0లో భాగంగా మున్సిపాలిటీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వే నిర్వహించాయి. అందులో భాగంగా ఒకరోజు వర్క్‌షాప్‌లోనూ పాల్గొని వచ్చాం. కావేరమ్మపేట నల్లచెరువు అభివృద్ధికి స్కీంలో రూ.10కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. చెరువులో బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. నల్లకుంట, ఊరచెరువును అభివృద్ధి చేయాలని కోరాం. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు, జడ్చర్ల ఫ్‌లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం దుకాణా సముదాయం నిర్మాణం వంటి వాటిపై చర్చ జరుగుతుంది. వీటిపై త్వరలోనే స్పష్టత రానుంది.
– లక్ష్మారెడ్డి,
కమిషనర్, జడ్చర్ల పురపాలిక


