వేసవిలో ఉద్యాన పంటల సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ఉద్యాన పంటల సంరక్షణ

Apr 10 2026 10:57 AM | Updated on Apr 10 2026 10:57 AM

నీటి వృథాను తగ్గించే పద్ధతులు

అలంపూర్‌: జిల్లాలో బోరు బావుల కింద చీని, మామిడి, జామ, సపోట, దానిమ్మ వంటి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. వేసవి వచ్చిందంటే ఆయా తోటలకు నీటి తడులను ఇచ్చేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పంటలను రక్షించుకోనే మార్గాలను అలంపూర్‌ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు వివరించారు.

నేల నుంచి తేమ ఆరిపోకుండా చూడటం..

నేల నుంచి తేమ ఆరిపోకుండా చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలను వివరించారు. అందులో ఒకటి సేంద్రియ ఎరువులు వాడటం, రెండోది వ్యర్థ పదార్థాలతో మల్చింగ్‌ విధానం.

సేంద్రియ ఎరువులు వాడటం

తేమను బాగా పట్టి ఉంచి ఆరిపోకుండా తగ్గించడమే కాకుండా సత్తువను అందించే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల పెంటు, గొర్రెల, మేకల ఎరువులు, వేప అముదం, కానుగ పిండి చెట్ల పాదులలో వేయాలి.

వ్యర్థ పదార్థలతో మల్చింగ్‌

వేసవి ప్రారంభం నుంచే చెట్ల పాదుల్లో ఆకులు, వరిపోట్టు, వేరుశనగ, కాయ పొట్టు, గింజలు తీసిన మొక్కజొన్న కండలు, వాటిని పాదుల్లో మూడు అంగుళాల ఎత్తు వరకు వేయాలి. దీనిని సేంద్రియ మల్చింగ్‌ అంటారు. దీని వలన పాదుల్లోని తేమ త్వరగా ఆరిపోదు. కలుపు మొక్కల బెడద పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యర్థ పదార్థాలు కుళ్లి సేంద్రియ పదార్థాంగా మారి చెట్లకు సత్తువను ఇస్తాయి.

1.పైపుల ద్వారా నీరు పారించడం

రైతులు నీటి వనరులైన బావులు, బోరు బావుల నుంచి చెట్ల వరకు పిల్ల కాలువలు తవ్వి నీరు పారించడం పరిపాటి. కాలువల ద్వారా నీరు పారింటప్పుడు ఎండకు, గాలికి నీరు ఆవిరి కావడం, భూమిలోకి నీరు ఇంకడం వలన నీటి నష్టం జరుగుతుంది. పిల్ల కాల్వలకు బదులుగా పీవీసీ లేదా హెచ్‌డీపీవీ పైపుల ద్వారా నీరు పంపితే నీటి వృథా తగ్గించవచ్చును.

2.నీటిని పొదుపు చేయడం

వేసవిలో బావులు, బోరు బావుల నుంచి లభించే కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. దీని కోసం పెద్దగా ఉన్న చెట్ల పాదులను కదించి చిన్నవిగా చేసుకోవాలి. నీరు పారిస్తే తక్కువ నీటితో ఎక్కువ చెట్లకు నీరు అందించ వచ్చును.

3.ట్యాంకర్ల ద్వార నీటి సరఫరా..

కొన్ని తోటల్లో బావులు, బోరు బావుల్లో పూర్తిగా ఎండిపోయి నీటి పారుదల ఉండదు. దీని వల్లతోటలు ఎండిపోయే ప్రమాదం రావచ్చు. ఈ పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వార నీటి సరఫరా చేసుకోవాలి.

4.నీటి కుంటల తవ్వక

వేసవిలో నీటి ఎద్దడి వంటి గడ్డు పరిస్థితుల నుంచి బయట పడటానికి ముందు జాగ్రత్తగా వర్షాకాలంలోనే తోటల్లో నీటి కుంటలు (ఫామ్‌ పాండ్స్‌ను) తవ్వుకోవాలి. 14 X14 X14 మీటర్ల సైజు తవ్వుకుంటే 10 లక్షల నీటిని అందులో నిల్వ చేసుకోవచ్చును. ఈ నీటిని డ్రిప్‌ ద్వారా 80 నుంచి 100 రోజులు రెండు ఎకరాల తోటకు అందించవచ్చును.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement