‘అసైన్డ్‌ భూమిని ఎవరికీ అప్పగించొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్‌ భూమిని ఎవరికీ అప్పగించొద్దు’

Apr 10 2026 10:57 AM | Updated on Apr 10 2026 10:57 AM

గట్టు: చిన్నోనిపల్లి పునరావాస కేంద్రానికి ఆనుకుని ఉన్న ఎర్రగట్టు వద్ద 2 ఎకరాల అసైన్డ్‌ భూమిని గుర్తించేందుకు వెళ్లిన అధికారులను గరువారం స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. చాగదోనకు చెందిన కటికె బాలాజీకి గతంలో సర్వే నంబర్‌ 521/5లో 5 ఎకరాల అసైన్డ్‌ పట్టాను ప్రభుత్వం మంజూరు చేసింది. బాలాజీకి సంబంధించిన పట్టా భూమిని గతంలో చాగదోన పాఠశాలకు విరాళంగా ఇవ్వగా.. వీరికి అసైన్డ్‌ పట్టా ఇచ్చారు. బాలాజీ వారసులు శివాజీ ఏడాది కాలంగా పట్టా భూమికి సర్వే చేసి హద్దులు చూపించాలని తహసీల్దార్‌, ఆర్డీఓ, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సర్వేయర్‌ హరికృష్ణ, ఎస్‌ఐశేఖర్‌గౌడు చిన్నోనిపల్లె పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. సర్వే నంబర్‌ 521లోని బాలాజీకి చెందిన అసైన్డ్‌ పట్టాభూమి పునరావాస కేంద్రానికి సమీపంలోనే గుర్తించారు. కేవలం 2 ఎకరాలు గుర్తించి అప్పగిస్తే చాలని పట్టాదారులు పట్టుపట్టారు. అయితే సర్పంచు దేవేందర్‌, గ్రామస్తులంతా కలిసి అధికారులను అడ్డుకున్నారు. ఊరికి ఆనుకున్న ఉన్న భూమిని రైతుకు ఎలా అప్పగిస్తారని, భవిష్యత్‌ అవసరాలకు ఈ భూమి గ్రామస్తులకు ఎంతో ఉపయోగ పడుతుందని, సర్వే చేయడానికి వీలు లేదంటూ గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగి, సర్వేను అడ్డుకున్నారు. అధికారులు గ్రామస్తులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు శాంతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరికి ఆనుకొని ఉన్న భూమిని సాగు చేసుకునేందుకు రైతుకు అప్పగించే ముచ్చటే లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు చిన్నోనిపల్లె పునావాస కేంద్రం నుంచి వెనక్కి తిరిగి వచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. తాము కూడా కలెక్టర్‌ను కలిసి ఈ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వొద్దని వినతిపత్రం ఇవ్వనున్నట్లు చిన్నోనిపల్లి గ్రామస్తులు తెలిపారు.

సర్వే చేయడానికి వెళ్లిన

అధికారులను అడ్డుకున్న

చిన్నోనిపల్లి గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement