సీఐటీఐఐఎస్ 2.0 పథకం కింద జడ్చర్ల మున్సిపాలిటీలో పర్యాటక అభివృద్ధికి పై ఏజెన్సీలకు చెందిన ప్రతినిధి సునీల్ కొద్దిరోజుల క్రితం మున్సిపాలిటీలో పర్యటించారు. కావేరమ్మపేట నల్లచెరువు, పాతబజార్ ఊరచెరువు, నల్లకుంట, జడ్చర్ల క్రాస్‌రోడ్డు వద్ద ఫ్‌లైఓవర్ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే 44వ నంబరు జాతీయ రహదారికి పక్కనే ఉండటం ఇదివరకే మినీట్యాంక్ బండ్ అంటూ కొంత అభివృద్ధి జరగడంతో నల్లచెరువు వైపు పై ఏజెన్సీ మొగ్గు చూపుతుంది. రూ.10–20కోట్లతో చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా పర్యాటకంగా పట్టణ వాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు సేదతీరే ఆస్కారం ఉన్నట్లు అంచనా. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. మురుగు నీటిని శుద్ధి చేశాక ఆ నీటిని మున్సిపాలిటీలో ఇతర అవసరాలకు వినియోగించేలా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటు జడ్చర్ల క్రాస్‌రోడ్డు ప్లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం చిన్న దుకాణా సముదాయం నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలు ఏజెన్సీ నిర్వాహకులు తీసుకొచ్చారు. తద్వారా రోడ్డుపై వ్యాపారాలు నిర్వహించకుండా ఉండడంతోపాటు ట్రాఫిక్ సమస్య తీరే అవకాశాలున్నాయని వారి వర్క్‌షాప్‌లో వివరించినట్లు తెలిసింది.


