ఆక్యుపెన్సీ అవస్థలు! | - | Sakshi
Sakshi News home page

ఆక్యుపెన్సీ అవస్థలు!

Mar 20 2026 9:38 AM | Updated on Mar 20 2026 9:38 AM

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే.. ఇటీవలే గృహ నిర్మాణం పూర్తిచేసుకున్నాం. 2024 డిసెంబర్‌ 15నుంచి అమలు

జడ్చర్ల టౌన్‌: మున్సిపాలిటీ, గ్రామాల్లో గృహ నిర్మాణదారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేనిదే విద్యుత్‌ మీటర్లను కేటగిరీ 8నుంచి 1కి మార్చడం సాధ్యం కాదని అధికారులు తేల్చడంతో బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. విద్యుత్‌ కార్యాలయానికి వెళ్తే సర్టిఫికెట్‌ కావాల్సిందేనని, మున్సిపల్‌కు వెళితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎవరికివారు తప్పించుకుంటున్నారు. దీంతో గృహ నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో మాన్యువల్‌గా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుండటంతో అక్కడ సమస్య అంతగా ఉత్పన్నం కావడంలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. సాధారణంగా గృహ నిర్మాణం చేసే సమయంలో విద్యుత్‌ శాఖ తాత్కాలిక కనెక్షన్‌ ఇస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక దానిని క్యాటగిరి 1 కిందకు మార్చడంతో సమస్య తీరిపోతుంది. భారీ గృహాలు, చిన్నగృహాలు తేడా లేకుండా అన్నింటికి ఇదే అమలు చేస్తూ వచ్చారు. అయితే 2024 డిసెంబర్‌ 15నుంచి వచ్చిన కొత్త నిబంధనలు గృహ నిర్మాణదారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇంటి నిర్మాణం 10మీటర్ల ఎత్తు దాటితో దానికి తప్పనిసరిగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చారు. ఇదే గృహ నిర్మాణదారులకు అసలు సమస్యగా మారింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను మున్సిపాలిటీ నుంచి జారీ చేయాలి. ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్‌, భారీ నిర్మాణాలు చేసేవారు నేరుగా తమ బిల్డర్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేసుకుంటుండగా చిన్నగృహాలు నిర్మాణం చేసుకునేవారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. నేరుగా ఆన్‌లైన్‌ చేసుకునే వెసులుబాటు లేకపోవటమే ఇందుకు కారణం. వాస్తవానికి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 18వేలకుపైగా గృహాలు ఉండగా కేవలం 10లోపు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందాయి.

మున్సిపల్‌ వ్యూ

మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయాలంటే ముందుగా వినియోగదారుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నాక టీపీఓ వచ్చి గృహాన్ని పరిశీలించి ఓకే అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయబడుతుంది. దీనివల్ల నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరిగేందుకు ఆస్కారం పెరుగుతుంది. నిబంధనలు పాటించని వారికి కొంత ఇబ్బంది కలుగుతుందనడంలో నిస్పందేహం. ఇటీవల ఆక్యుపెన్సీ కోసం కార్యాలయానికి వస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది.

– లక్ష్మారెడ్డి,

కమిషనర్‌ మున్సిపాలిటి, జడ్చర్ల

విద్యుత్‌ బిల్లు వచ్చాక చూస్తే గుండె గుబేళ్‌మనేలా ఉంది. వేలల్లో బిల్లు రావడంతో విద్యుత్‌ కార్యాలయానికి పరుగులు తీశాం. అక్కడ అధికారులు క్యాటగిరి 8లో ఉందని, అందుకే బిల్లు ఎక్కువగా వచ్చిందని చెబుతున్నారు. క్యాటగిరి–1లోకి మారిస్తేనే బిల్లు తగ్గుతుందని, అందుకు మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తేవాలని చెబుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకు ముందులాగే ఆక్యుపెన్సీ లేకుండా విద్యుత్‌ మీటర్లు క్యాటగిరి 1 కింద ఇస్తే బాగుంటుంది.

– పావనదీప్తి,

శ్రీనివాసనగర్‌కాలనీ, జడ్చర్ల మున్సిపాలిటీ

2024 డిసెంబర్‌ 15నుంచి మున్సిపాలిటీ, జీపీ ఎక్కడైనా సరే కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే క్యాటగిరి మార్చేందుకు వీలవుతుంది. ఇంటి నిర్మాణ సమయంలో తాత్కాలికంగా మీటరు కేటాయిస్తాం. నిర్మాణం పూర్తయ్యాక నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం జరిగి ఉంటే మున్సిపాలిటీ, పంచాయతీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే క్యాటగిరి మార్చటం జరుగుతుంది. విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు సైతం చేస్తున్నారు. అందుకే నిబంధనలకు లోబడే క్యాటగిరి కేటాయిస్తాం.

– చంద్రశేఖర్‌, ఏడీఈ, జడ్చర్ల సబ్‌డివిజన్‌

గృహనిర్మాణదారులకు కొత్త కష్టాలు

కేటగిరీ 8గా మార్చడంతో

భారీగా విద్యుత్‌ బిల్లులు

వినియోగదారులను

తిప్పుకుంటున్న అధికారులు

మున్సిపాలిటీ, విద్యుత్‌శాఖలకు

పెరగనున్న ఆదాయాలు

బల్దియా ఎన్నికల వేళ తలనొప్పిగా మారిన నిబంధనలు

వాస్తవానికి గృహనిర్మాణం చేసే సమయంలో నిబంధనలు పాటించకుండా వదిలేస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ అనుమతి తీసుకుని కొందరు మూడు ఫ్లోర్లు, మరికొందరు 4, 5 అంతకుమించి ఫ్లోర్లు కడుతున్నారు. దీంతో మున్సిపాలిటీకి పన్నులు సైతం సక్రమంగా చెల్లించకుండా ఉన్నారు. 2024 డిసెంబర్‌ వరకు విద్యుత్‌శాఖ సైతం నిర్మాణాలు ఎలా ఉన్నా అన్నింటికి క్యాటగిరి 1 కింద కనెక్షన్లు క్రమబద్దీకరించారు. నూతన నిబంధనలు రావడంతో తప్పనిసరిగ క్యాటగిరి 8 ఇస్తున్నారు. దీంతో విద్యుత్‌ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే తనిఖీ సమయంలో నిబంధనలు పాటించని విషయం వెలుగుచూసి మున్సిపాలిటీ అధికారులు సైతం పన్నులను విధించేందుకు ఆస్కారం కలుగుతుంది. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ కారణంగా గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. పదిమీటర్ల ఎత్తు దాటిందంటే తప్పనిసరిగా క్యాటగిరి 8కిందే ఉంచుతామని విద్యుత్‌శాఖ తేల్చడంతో వినియోగదారుడికి కష్టాలు తప్పడంలేదు. జడ్చర్ల మున్సిపాలిటీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ కష్టాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పందించి మున్సిపల్‌, విద్యుత్‌శాఖలకు ఆదాయం తగ్గకుండా వినియోగదారులపై భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement