అమ్రాబాద్: మేకల కాపరిపై ఎలుగుబంటి దాడిచేయగా తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకోగా.. గురువారం ఆలస్యంగా తెలిసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పదర మండలం పెట్రాల్‌చేన్‌పెంటకు చెందిన చిగుళ్ల ప్రశాంత్ మేకలను మేపేందుకు బుధవారం సమీప అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా పొదలచాటున ఉన్న ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడిచేసింది. దగ్గరలో ఉన్న మరో ఇద్దరు కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. ఈ దాడిలో ప్రశాంత్ కాలు, చేతులు, శరీర బాగాలకు తీవ్రగాయాలు కాగా 108అంబులెన్స్‌లో అచ్చంపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆర్డీటీ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
నాగర్‌కర్నూల్ క్రైం : కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు గ్రామానికి చెందిన ఎత్తపు పద్మ (49) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె చాలా రోజుల నుంచి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన పద్మ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడి మృతి
ఇటిక్యాల: ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని మొగళిరావుల చెరువుకు చెందిన బాబర్ (19) స్నేహితుడు ఫిరోజ్‌తో కలిసి గురువారం ఉగాది పండుగ సందర్భంగా ట్రాక్టర్ కడిగేందుకు గ్రామ సమీపంలోని జూరాల కుడి కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువపై ట్రాక్టర్ అదుపు తప్పి ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాబర్, ఫిరోజ్‌లను స్థానికులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే బాబార్ మృతి చెందినట్లు తెలిపారు. పండగ పూట విషాదం జరగడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై స్ధానిక ఎస్‌ఐను వివరణ కోరగా తమకు సమాచారం అందలేదని తెలిపారు.
చేపల వేటకు వెళ్లి దుర్మరణం
తెలకపల్లి: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు మేరకు.. మండల పరిధిలోని చిన్నముద్దునురు గ్రామానికి చెందిన సంగిశెట్టి మల్లయ్య (63) గురువారం భార్యతో కలిసి చిన్నముద్దును రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లారు. మల్లయ్య చేపలు పట్టే క్రమంలో చెరువులో పడి మునిగిపోయాడు. గమనించిన భార్య చుట్టుపక్కల వారిని పిలువగా అప్పటికే మల్లయ్య మృతి చెందగా మృతదేహాన్ని బయటికి తీశారు. ఉగాది పర్వదినం రోజు మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదవశాత్తు
చెరువులో పడి వ్యక్తి మృతి
ఆత్మకూర్: పండుగపూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన గురువారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో చోటుచేసుకున్నది. ఎస్సై జయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్‌లో నివాసం ఉంటున్న రాములు (47) ఉదయం 11 గంటల సమయంలో స్నానానికి చెరువుకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్న వారందరు చూస్తుండగానే మునిగిపోయాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు, ప్రయాణికులు రాములును ఒడ్డుకు చేర్చారు. దీంతో అపస్మార స్థితిలో ఉన్న రాములును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే రాములు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


